శిరీష ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు:సీపీ మహేందర్ రెడ్డి

శిరీష ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు:సీపీ మహేందర్ రెడ్డి
హైద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య వ్యవహారంలో నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. 13 ఏళ్ల క్రితం శిరీష వివాహం చేసుకుందని, 12 ఏళ్ల కూతురుందని ఆయన తెలిపారు. మొదట షాప్‌ పెట్టిందని, లాభం రాకపోవడంతో షాప్‌ మూసేసిందని వెల్లడించారు. నాలుగేళ్లుగా ఆర్‌జే ఫొటోగ్రఫీలో శిరీష పనిచేస్తోందని, ఆ స్టూడియో యజమాని రాజీవ్ తేజస్విని అనే మరో యువతిని ప్రేమించాడని ఆయన తెలిపారు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించారని, కానీ క్రమేపీ తేజస్విని.. రాజీవ్‌పై అనుమానం పెంచుకుందని చెప్పారు. రాజీవ్‌ పట్టించుకోవడం లేదని తేజస్విని భావించిందని, ఈ విషయంలోనే శిరీష, రాజీవ్‌ మధ్య సంబంధం ఉందని తేజస్విని పలుమార్లు గొడవ పడిందని మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. గత నెలలో శిరీష, రాజీవ్‌, తేజస్విని బంజారాహిల్స్‌ పీఎస్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని ఆయన తెలిపారు. రాజీవ్ స్నేహితుడు శ్రవణ్‌ సలహా మేరకు ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని కలిశారని చెప్పారు.
రాజీవ్‌ కారులో ముగ్గురు కుకునూరు పల్లి వెళ్లారని, అనీషా వైన్స్‌లో మద్యం కొనుగోలు చేశారని సీపీ తెలిపారు. రాయదుర్గం రెస్టారెంట్‌ స్నాక్స్‌ తీసుకొని వెళ్లారని, రాత్రి 3.30 వరకు ఎస్సై క్వార్టర్‌లో నలుగురు ఉన్నారని, నలుగురి కలిసి మద్యం సేవించారని విచారణలో తేలినట్లు సీపీ చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి, శ్రవణ్‌, రాజీవ్‌ క్వార్టర్‌ నుంచి బయటికి వచ్చారని ఆయన తెలిపారు. శిరీష కూడా బయటికొస్తానందని, సెంట్రీ చూస్తే ఇబ్బందవుతుందని ఎస్ఐ చెప్పారని ఆయన వివరించారు.
రాత్రి 1.58 కి శిరీష భర్తకు లొకేషన్‌ను షేర్‌ చేసిందని, శిరీష ఆలస్యంగా వస్తానని భర్త, కూతురికి చెప్పినట్లు విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు. రాత్రి 2 గంటలకు రాజీవ్‌కు శిరీష వాట్సప్‌ మేసేజ్‌ పంపిందని, రాజీవ్‌, శ్రవణ్‌ బయట ఇద్దరు మాట్లాడుతుండగా ఎస్‌ఐ ఉన్న గదిలో అరుపులు కేకలు వినిపించినట్లు స్పష్టమైందని సీపీ తెలిపారు. తాను అలాంటి దాన్ని కాదని శిరీష కేకలు వేసిందని, అరవొద్దని రాజీవ్‌, శ్రవణ్‌ బెదిరించారని ఆయన వివరించారు. గొడవ ఎక్కువ అవుతుందని అమ్మాయిని బలవంతంగా తీసుకొని కారులో వచ్చారని, 2.30 వరకు కుకునూరుపల్లిలో ఉన్నారని, కారులో వస్తున్నప్పుడు శిరీష ఏడుస్తూ గొడవ చేస్తూ ఉందని విచారణలో స్పష్టమైనట్లు సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
రన్నింగ్‌ కారులో శిరీష డోర్‌ ఓపెన్‌ చేసిందని, కారు స్లో చేయగానే శిరీష పరుగెత్తడానికి యత్నించిందని తెలిపారు. శిరీషను జుట్టు పట్టి కారులోకి లాగి చెంప దెబ్బలు కొట్టారని చెప్పారు. రాత్రి 3.45కి ఫొటోగ్రఫీ ఆఫీస్‌కు చేరారని, కారు డోర్‌ తీసి శిరీష అపార్ట్‌మెంట్‌లోకి పరిగెత్తినట్లు విచారణలో తేలింది. 3.47కి బయోమెట్రిక్‌ ద్వారా శిరీష డోర్‌ ఓపెన్‌ చేసిందని, రాజీవ్‌, శ్రవణ్‌ అపార్ట్‌మెంట్‌ కింద ఉండిపోయారని, శిరీష ఇంకా బయటికి రావడం లేదని 3.55కి రాజీవ్‌, శ్రవణ్‌ పైకి వెళ్లారని సీపీ చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగిందో సీపీ మహేందర్ రెడ్డి మాటల్లోనే…
 • 3.59కి శ్రవణ్‌ను పంపించేందుకు రాజీవ్‌ క్యాబ్ బుక్‌ చేశారు
 • రాజీవ్‌ బిజీగా ఉండడం వల్ల శిరీష వీడియో కాల్‌ రిసీవ్‌ చేసుకోలేదు
 • రాజీవ్‌కు అనుమానం వచ్చి డోర్‌ను పగులగొట్టాడు
 • అప్పటికే శిరీష ఉరేసుకుని ఉంది
 • 4.10కి శ్రవణ్‌కు కాల్‌ చేసి ఉరేసుకున్న విషయం చెప్పాడు
 • 4.11కి 100 కాల్‌ చేసి ఉరేసుకున్న విషయం చెబితే పోలీసులు వెళ్లారు
 • 4.19కి ఇంకా రాలేదు తొందరగా రావాలని శ్రవణ్‌ను రాజీవ్‌ కోరాడు
 • అప్పటికే ప్రాణం పోయింది, శవాన్ని మంచంపై పడుకోబెట్టారు
 • ఆ రాత్రి అపోలో ఆస్పత్రికెళ్లి అంబులెన్స్‌ తీసుకొచ్చారు
 • ప్రాణం లేదని వైద్యులు చెప్పారు
 • పోలీసులు శిరీష భర్త సతీష్‌చంద్రకు సమాచారం అందించారు
 • తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని భర్త చెప్పారు
 • రాజీవ్‌ విచారణలో తొలుత ఈ విషయాలన్నీ చెప్పలేదు
 • ప్రభాకర్‌రెడ్డికి హరీందర్‌ నాలుగు సార్లు కాల్‌ చేశారు
 • 10.5కి హరీందర్‌కు ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ చేశారు
 • మీ దగ్గరికి వచ్చి లిక్కర్‌ తాగారని చెబుతున్నారని హరీందర్‌ చెప్పాడు
 • నేను తాగలేదని చెప్పి ఎస్సై ఫోన్ పెట్టేశాడు
 • శిరీష పెదవులపై గాయాలున్నాయి
 • శిరీష తలకు, కడుపులో గాయాలున్నాయి
 • విచారణ జరుగుతుండగానే ఉ.11.30 సమయంలో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు.

*

*

Top