విభజనకు చంద్రబాబూ కారణం: దిగ్విజయ్ సింగ్

విభజనకు చంద్రబాబూ కారణం: దిగ్విజయ్ సింగ్
అమరావతి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, నవ్యాంధ్రకు నష్టం చేసిన దేశద్రోహులపై సానుభూతి చూపొద్దన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. చంద్రబాబుకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబుతో సహా అందరూ రాష్ట్ర విభజనకు కారకులేనని, ఇప్పుడు ఆయన బిజెపి పక్షాన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అవసరం లేదని అంటున్నారని దిగ్విజయ్‌ ఆరోపించారు. హోదాను తమ పార్టీ సాధిస్తుందని, దీనిపై జాతీయ స్థాయిలో పోరును చేపట్టేందుకు సిద్ధమైందన్నారు.

విభజనతో రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్లీ మన దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కార్చే దేశద్రోహుల పట్ల సానుభూతి తెలియజేయొద్దని, అలాగని విద్వేషాలు పెంచుకున్నా లాభం లేదని, బ్రహ్మాండంగా ఎదుగుదామని, వాళ్లంతా అసూయతో కుమిలి కుమిలి బాధపడే విధంగా చేద్దామని సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, విపక్షాలపై ధ్వజమెత్తారు.

కాగా, ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయమై జాతీయస్థాయిలోనూ మద్దతు కూడగట్టడంలో భాగంగా వివిధ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకురాగలిగింది. కాంగ్రెస్‌, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే పార్టీల నేతలు స్వయంగా పాల్గొనగా సీపీఎం, జనసేన, తృణమూల్‌కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌ వంటి పార్టీల మద్దతును సాధించగలిగింది.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని నేపథ్యం నుంచి మళ్లీ రాజకీయంగా నిలవడానికి ప్రత్యేక హోదా సాధనంగా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ ఈ భరోసా సభను నిర్వహించింది. ఇది ముగిసిన అధ్యాయం కాదని, రాబోయే ఎన్నికలకు కూడా నిలిచే అంశమేనని చాటే ప్రయత్నం చేసింది. విభజనతో ఏపీలో నష్టపోయింది. ఇప్పుడు హోదాతో తిరిగి పుంజుకోవాలనుకుంటోంది.

పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని పార్టీ నేతలందరూ సభకు తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలందరూ వచ్చారు. చిరంజీవి అందుబాటులో లేకపోవడంతో రాలేదు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పల్లంరాజు, పనబాకలక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, శాసనసభ మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, నేతలు సాకే శైలజానాథ్‌ తదితరులు వచ్చారు.

*

*

Top