రవాణా శాఖ పనితీరుపై ఫైర్:ఎంపీ కేశినేని నాని

రవాణా శాఖ పనితీరుపై ఫైర్:ఎంపీ కేశినేని నాని
రవాణా శాఖ పనితీరుపై  ఫైర్:ఎంపీ కేశినేని నాని:విజయవాడ: రవాణా శాఖ పనితీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రవాణాశాఖ అధికారులపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన రవాణాశాఖాధికారులకు క్షమాపణ చెప్పారు.తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్య తీసుకోవడంతో ఆయన మరోసారి రవాణాశాఖాధికారులపై రెచ్చిపోయారు. తాజాగా మరోసారి రవాణాశాఖ అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తే రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమకుట్టినట్టుగా కూడ లేదని విమర్శించారు. రవాణాశాఖ వ్యవహరిస్తున్నతీరుపై మొదటినుండి విజయవాడ ఎంపి కేశినేని నాని తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై రవాణశాఖ అధికారులతో నానితో సహ టిడిపి ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.

దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయమై అసెంబ్లీలో కూడ గొడవ చోటుచేసుకొంది. అయితే ఈ అంశాన్ని విపక్షాలు ఆయుధంగా తీసుకొన్నాయి. ఈ ఘటనతో పాటు చోటుచేసుకొన్న వరుస ఘటనలు టిడిపికి రాజకీయంగా నష్టం కల్గించాయనే అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది. దీంతో వెంటనే నష్టనివారణ చర్యలను ప్రారంభించింది.

రవాణాశాఖపై నిప్పులు చెరిగిన కేశినేని నాని ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్ ప్రదేశ్ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే రాష్ట్రంలో అధికారులు ఏ మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ప్రజాజీవితంలో మచ్చ ఉండకూడదనే కారణంగానే బస్సుల వ్యాపారాన్ని విడిచిపెట్టినట్టు చెప్పారు. గతంలో తాను తిప్పిన బస్సుల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి లేవన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణాశాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణాశాఖ మొత్తం అవినీతిమయంగా మారిందని ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.

తమ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకొని నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్ల పర్మిట్లను అరుణాచల్ ప్రదేశ్ రద్దుచేసింది.అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో స్లీపర్ బస్సుల్లో 2 ప్లస్ 1 విధానంలో 36 బెర్తులు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంది. ఒక్క బస్సులో ఆరు కంపార్ట్ మెంట్లు, ఒక్కో దానిలో నాలుగు బెర్తులు ఏర్పాటుచేస్తారు. అంటే 24 బెర్తులు ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు మరో వైపు 12 సీట్లు ఏర్పాటుచేస్తారు. వాటిని కూడ స్లీపర్ సీట్లుగా పరిగణిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్కో బస్సుకు పన్ను రూపంలో ఏటా కేవలం రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతోంది. అదే తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అరుణాచల్ లో రిజిస్ట్రేషన్ చెయించుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును తప్పించుకొంటున్నారు.

నిబంధనలనలను బేఖాతరు చేస్తూ నడుస్తున్న వెయ్యి బస్సులపై అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం నోరుమెదపడంలేదు. స్థానికంగా నిబంధనల ఊసే లేకుండా యధేచ్చగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నా చిన్న చర్యలు కూడ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలు అందిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకొంటామని రెండు రాష్ట్రాలకు చెందిన రవాణాశాఖాధికారులు చెబుతున్నారు.

తమ రాష్ట్రంలో రిజిస్టర్ చేయించుకొన్న బస్సులు నిర్ధారిత సమయంలో ఖచ్చితంగా తమ భూ భాగంలోకి రావాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెయ్యి ట్రావెల్స్ బస్సలపై చర్యలు తీసుకొంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ట్రావెల్స్ నిర్వాహకులు తమ బస్సులకు టూరిస్ట్ పర్మిట్ తీసుకొని స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. చట్టరీత్యా ఇది నేరం. కానీ, తెలుగు ప్రభుత్వాలు ఈ ట్రావెల్స్ విషయాల్లో కిమ్మనకుండా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసికి ట్రావెల్స్ కారణంగా ఏటా రూ.800 కోట్లు నష్టం వస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ లను ఉపసంహరించుకొని తెలుగు రాష్ట్రాల్లో నమోదుచేసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఓ సి జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్ రవాణశాఖ ఎన్ ఓ సి ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రవాణాచట్టానికి స్వల్ప మార్పులు చేసింది. దీని ప్రకారంగా ఈ బెర్తలు సంఖ్యలో మార్పులు చేర్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. దీంతో అది 2 ప్లస్, 1 బెర్తుల విధానంగానే ఉండేలా ఆదేశాలు జారీ చేయించడానికి ప్రైవేట్ ఆపరేటర్లు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారని సమాచారం.

*

*

Top