బాహుబలి 2 రివ్యూ

బాహుబలి 2 రివ్యూ

 బాహుబలి 2 రివ్యూ:బాహుబలి విడుదలై రెండేళ్లవుతోంది. అప్పట్నుంచి ప్రతి ఒక్కరి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అనే. ఈ ప్రశ్నకు సమాధానం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకే కాక ప్రపంచ సినిమా ప్రేక్షకులకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. మరి రాజమౌళి చెప్పిన సమాధానంతో ప్రేక్షకులు సంతుష్టులయ్యారో లేదో చూద్దాం..!!!

కథ : అద్భుత దృశ్యమాలికలా తెరకెక్కిన “బాహుబలి 2” కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. తన తండ్రి అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ను చంపించి, కన్నతల్లి దేవసేన (అనుష్క)ను బంధించిన దుష్ట చక్రవర్తి భాల్లాల దేవుడు (రానా) పై అమరేంద్ర బాహుబలి తనయుడు మహేంద్ర బాహుబలి (ప్రభాస్) పగ తీర్చుకోవడమే చిత్ర కథాంశం. కథగా చెప్పుకోవడానికి పేలవంగా ఉన్నా.. చిత్రరూపం మాత్రం అబ్బురపరిచేలా ఉంది.

అయితే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం “ఒన్ వర్డ్ ఆన్సర్ కాదు”. బంధబాంధవ్యాల కోణంలోని కర్కశ చర్య. ఆ చర్య ఏమిటనేది మాత్రం వెండితెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : “అమరేంద్ర బాహుబలి”గా రాజసాన్ని, “మహేంద్ర బాహుబలి”గా ఆవేశాన్ని ఉచ్చస్థాయిలో ప్రదర్శించాడు ప్రభాస్. ఆ రెండు పాత్రల్లో ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించడానికి సైతం మనసు రాని విధంగా ప్రభాస్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని సంతకం చేశాడు. నిండు గర్భవతి అయిన తన భార్యపై చేయి వేయడానికి ప్రయత్నించడమే కాక నిండు సభలో సంకెళ్లతో ఆమెను బంధించి అవమానించిన సేతుపతి తలను నరికే సన్నివేశంలో ప్రభాస్ చూపిన పరిణితి అతడు పాత్రలో ఏస్థాయిలో లీనమైపోయాడో అనే విషయాన్ని చెప్పుకోవడానికి ఓ నిదర్శనం. “బాహుబలి”లో అనుష్కను చూసి కాస్త డీలా పడ్డ అభిమానులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యేలా ఆమె పాత్రను తీర్చుదిద్దాడు రాజమౌళి. సినిమాలో అత్యంత శక్తివంతమైన శివగామిని శాసించగల పాత్రలో అనుష్క అభినయం ప్రశంసనీయం. “అరుంధతి” తర్వాత అనుష్క పోషించిన అత్యద్భుతమైన పాత్రగా “దేవసేన” నిలిచిపోతుంది.

కుతంత్రంతో రాజ్యాన్ని కైవసం చేసుకొన్న కుటిల-క్రూర చక్రవర్తిగా మొదటి భాగంలో అలరించిన రాణా.. రెండో భాగంలోనూ అదే స్థాయిలో విలనిజంతో ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా చచ్చిన “బాహుబలి” శవాన్ని గొడ్డలితో నరుకుతూ రాక్షసానందం పొందే సన్నివేశంలో రానా నటన, అతడి డిక్షన్ చూసి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడుండడు. ఫస్ట్ పార్ట్ లో రాజ్యాన్ని శాసించే శివగామి పాత్రలో చెలరేగిపోయిన రమ్యకృష్ణ సెకండ్ పార్ట్ లో దేవసేన పాత్ర డామినేట్ చేయడం వలన ఎక్కువగా అండర్ ప్లే చేయాల్సి వచ్చింది. బిజ్జలదేవుడిగా నాజర్, అమాయక చక్రవర్తిగా సుబ్బరాజులు పండించిన కామెడీ కొన్ని సన్నివేశాల్లో పర్లేదు కానీ.. అక్కడక్కడా సినిమాలోని ఇంటెన్సిటీని దెబ్బతీసింది.

సాంకేతికవర్గం పనితీరు : మకుట విజువల్ ఎఫెక్ట్స్ “బాహుబలి 2″కి హాలీవుడ్ స్థాయి తెచ్చిపెట్టాయి. “పింజారీ” యుద్ద ఘట్టం, పతాక యుద్ధ సన్నివేశంలో సైనికులు గాల్లో ఎగురుతూ కోటలోకి ప్రవేశించే సన్నివేశాలు చూడ్డానికి కన్నులపండుగా ఉండగా.. “హంస నావ” పాట చిత్రీకరణ ప్రేక్షకులను ఓ మూడు నిమిషాలపాటు ఊహాలోకంలోకి తీసుకెళ్లిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సింది సెంథిల్ సినిమాటోగ్రఫీ మాయ గురించి. ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ మొదలుకొని.. యుద్ధ సన్నివేశాలు, పతాక సన్నివేశంలోని ప్రభాస్-రానాల నడుమ యుద్ధ సన్నివేశంలో వినియోగించిన “బుల్లెట్ టైమ్ షాట్” ఇలా ప్రతి ఒక్కటి ఆశ్చర్యంతో కూడిన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి.

ఇక కీరవాణి తన సంగీతంతో, నేపధ్య సంగీతంతో సినిమాని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాడు. “సందర్భానుసారమైన పాట” అనే మాటకు సరైన నిదర్శనం “బాహుబలి 2” చిత్రంలోని సాహిత్యం. ప్రతి మాట పాటలో ప్రతిబింబించింది. ముఖ్యంగా.. “ఒక ప్రాణం” పాటతో టైటిల్ కార్డ్స్ వేస్తూ.. “ఫస్ట్ పార్ట్” మొత్తాన్ని రెండున్నర నిమిషాల్లో గుర్తు చేయడం అనేది రాజమౌళి చేసిన మౌళీలో ఒకటి. ఆ మౌళీకి మనమంతా చేతులెత్తి నమస్కరించాల్సిందే.

“అబ్బో రాజమౌళి ఇక్కడుండాల్సినోడు కాదురా” అని ప్రతి తెలుగు సినిమా అభిమాని గర్వంతో గొంతెత్తి అరిచేలా చేసిన సినిమా “బాహుబలి 2”. అపజయమన్నది ఎరుగని దర్శక ధీరుడిగా ఇప్పటికే అసంఖ్యాక అభిమానగణాన్ని సంపాదించుకొన్న రాజమౌళి “బాహుబలి 2″తో ప్రపంచస్థాయి దర్శకుల జాబితాలో చేరిపోయినట్లే. ప్రతి ఆలోచన ఓ అద్భుతం, ప్రతి ఫ్రేమ్ అత్యద్భుతం. ఏవో చిన్నపాటి మైనస్ లు తప్పితే.. ప్రభాస్ ఇంట్రో సీన్ ను డిజైన్ చేసిన తీరును మొదలుకొని.. పతాక సన్నివేశంలో ఎమోషన్ ను పతాక స్థాయిలో ఎలివేట్ చేసిన రాజమౌళి దర్శక ప్రతిభకు కళామతల్లి సైతం నీరాజనాలు పలకాల్సిందే.

విశ్లేషణ : తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపింపజేయగల సత్తా ఉన్న సినిమా “బాహుబలి 2”. రాజమౌళి తన క్రియేటివిటీతో ప్రేక్షకులను ఊహాలోకంలో తేలియాడేలా చేయగా.. ప్రభాస్ తన నటవిశ్వరూపంతో ఆద్యంతం ఆకట్టుకోగా, అనుష్క అద్వితీయమైన అభినయం, కీరవాణి సంగీతం, సెంథిల్ అద్భుత కెమెరా పనితనం తోడై “బాహుబలి 2” చిత్రానికి ప్రపంచస్థాయి చిత్రంగా చరిత్రలో చోటు సంపాదించిపెట్టడమే కాక “ఇదిరా తెలుగు సినిమా” అని ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తుకొనేలా చేసింది.

*

*

Top