క్యాష్ లేదంటే ఖాతాదారులుకు సమస్యే

క్యాష్ లేదంటే ఖాతాదారులుకు  సమస్యే: అది తణుకులోని ఓ రేషన డిపో.. ఒక కార్డుదారుడు 20 కేజీల బియ్యం, అర కేజీ పంచదార తీసుకున్నాడు. ఇందుకు చెల్లించాల్సిన మొత్తం 27 రూపాయలు. డబ్బులు ఇస్తానంటే డీలర్‌ వద్దన్నాడు. నగదు రహిత విధానంలో మీ బ్యాంకు అకౌంట్‌ నుంచి జమ చేసుకుంటానని చెప్పాడు. సరేనని సరుకులు ఇవ్వమని చెప్పాడు. ఇంతలో సర్వర్‌ సమస్య రావడంతో.. సరుకులు ఇవ్వలేదు. మర్నాడు రమ్మని చెప్పడంతో కార్డుదారుడు ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో సెల్‌ఫోనకు ఓ మెసేజ్‌ వచ్చింది. అది చూసి అవాక్కడయ్యాడు. సరుకులు ఇవ్వకపోగా.. తన అకౌంట్‌ నుంచి రూ.222.42 జమ చేసుకున్నాడని అర్థమైంది. డీలర్‌తో గొడవకు దిగాడు. తీసుకునే సరుకులకు.. బ్యాంకు అకౌంట్‌కు ఎంటర్‌ చేశానని.. ఇంతలో సర్వర్‌ సమస్య వల్ల సరుకులు ఇవ్వలేదని.. చెప్పాడు. ఇంత మొత్తం తగ్గినందుకు తానేమీ చేయలేనని అధికారులను మాట్లాడుకోవాలని చేతులెత్తేశాడు.

ఏలూరు: పెద్దనోట్ల రద్దు తర్వాత అందరి నోట వెంట వస్తున్న పదం.. నగదు రహితం. ఏ విధమైన లావాదేవీలు నిర్వహించినా క్యాష్‌లెస్‌గానే నిర్వహించాలి. ఈ విధానాన్ని చౌక డిపోల్లోనూ అమ లు చేస్తున్నారు. ఇక్కడ సాంకేతిక ఇబ్బందుల కారణంగా చౌక డిపోల్లో సరుకులు ఇవ్వకపోయినా బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము లాగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం గా నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే నేపథ్యంలో ఇటువంటి సమస్యలతో ప్రజల్లో నిరాశక్తత కలుగుతోంది. మరోవైపు చౌకడిపోల వద్ద రేషన్‌కార్డుదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒకటికి నాలుగుసార్లు తిరిగితే కానీ సరుకులు ఇచ్చే పరిస్థితి లేదు. నగదు రహిత లావాదేవీలకు సాంకేతిక సమస్యలు విఘాతం కలిగిస్తున్నాయి. అయినా ఈ విధానం అలవరచుకోవటం కోసం రేషన్‌ కార్డుదారులు తిప్పలు పడినా గంటలు తరబడి వేచి ఉన్నా నగదు రహితంలోనే సరుకులు తీసుకు వెళుతున్నారు. బ్యాంకులకు సెలవులు వస్తే నగదు రహితంలో లావాదేవీలు కొంచెం అలస్యంగా జరుగుతాయన్న విమర్శలు ఉన్నాయి. చౌక డిపోల కార్యకలాపాలకు సంబంధించి ఇంకా అదనపు సర్వర్లను ఉపయోగిస్తే ఈ సమస్యలు తీరతాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

అమ్మో నగదు రహితం

నగదు రహితం అంటేనే కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. చౌకడిపోల్లో నిత్యావసర సరుకులు తీసుకోకపోయినా బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము లాగేస్తున్నారు. ఈ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు కొంత మంది ప్రశ్నిస్తున్నారు. డిసెంబరులో సాధారణ విధానంలోనే కొంత మంది రేషన్‌ కార్డుదారులకు అరువు పద్ధతిలో కందిపప్పు ఇచ్చారు. పెద్దనోట్లు రద్దు తర్వాత నగదు పూర్తిగా చలామణీలోకి రాకపోవడంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. తర్వాత అది లబ్ధిదారులకు శాపంగా మారింది. సంబంధిత మొత్తం చౌక డిపో డీలర్లు జనవరిలో లబ్ధిదారులనుంచి వసూలుచేశారు. ఇప్పుడు నగదు రహితంలో సరుకులు తీసుకోవాలని వెళ్లిన లబ్ధిదారులకు నగదు రహిత విధానంలో ప్రస్తుత సొమ్ముతోపాటు, గతంలో క్రెడిట్‌గా చూపిస్తున్న కందిపప్పు సంబంధించిన సొమ్ము జమ చేసేసుకుంటున్నారు. ప్రతీ చౌక డిపోలో దాదాపు 20 శాతం ఇదే సమస్య ఎదురవుతోంది. తణుకులోని ఒక చౌక డిపోలో తీసుకున్న సరుకులకు రూ.27 ధర అయితే బ్యాంక్‌ ఖాతా నుంచి రూ222.42 జమ చేసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు సమాచారం వచ్చింది.
దీనిపై అధికారులను అడిగితే అధికంగా కట్‌ అయిన సొమ్ము తిరిగి వస్తుందని చెబుతున్నారు. ఏ నిమిత్తం ఇంత మొత్తం కట్‌ అయిందనే వివరాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా నిత్యావసర సరుకులు తీసుకోకుండా కూడా బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము డెబిట్‌ అయితే అటువంటి వారి వివరాలు సేకరించి పంపాలని చౌక డిపో డీలర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

సొమ్ము తిరిగి వెనక్కి వస్తుంది: జేసీ కోటేశ్వరరావు
సాంకేతిక సమస్యల కారణంగా చౌకడిపోల్లో సరుకులు తీసుకోని కార్డుదారులకు బ్యాంకు ఖాతా నుంచి సొమ్ములు డెబిట్‌ అయినట్లు సమాచారం ఉందని జేసీ పి.కోటేశ్వరరావు తెలిపారు. వీరి వివరాలు సేకరించాని డీలర్లకు ఆదేశాలు జారీచేశాన్నారు. సాంకేతిక సమస్యలు కారణంగా కందిపప్పుకు సంబంధించి బ్యాంకుల్లో రేషన్‌ కార్డుదారుల నగదు డెబిట్‌ అయితే ఆ సొమ్ము తిరిగి వారి ఖాతాకు చేరుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. జిల్లావ్యాప్తంగా నగదు రహిత విధానాన్ని ప్రోత్సహించాలనే చౌక డిపోల్లో ఈ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతికపరంగా ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం వల్ల వినియోగదారులకు మంచి ఉపయో గం ఉందన్నారు. సర్వర్‌ సమస్యలు తలెత్తినప్పుడు సరుకుల పంపిణీలో కొంత జాప్యం జరిగినా ఈ విధానం పారదర్శకంగా సాగుతుందన్నారు.

*

*

Top